ఎమ్మెల్యేలకు ఎర కేసుపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ కేసు తదుపరి విచారణను సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ బెంచ్ తీర్పుపై వాదనలు జరిగాయి. ఈ కేసులో బీజేపీపై ఆరోపణలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది అన్నారు.
అలాంటప్పుడు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే ఎలా అని ఆయన అన్నారు. సీబీఐ అనేది కేంద్రంలోని బీజేపీ సర్కార్ నియంత్రణలో పని చేస్తోందన్నారు. అలాంటప్పుడు ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని ఆయన వాదించారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని అనైతికంగా అక్రమ మార్గంలో కూలగొట్టాలని బీజేపీ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో 41 సీఆర్పీసీ జారీ చేశాక నిందితులు కోర్టుకు వచ్చారని అన్నారు. కేవలం రెండు తీర్పులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని సింగల్ బెంచ్ తీర్పు ఇచ్చిందని, అది సరికాదన్నారు.
సీక్రెట్ కెమెరాల్లో, ఆడియో రికార్డుల్లో నమోదైన వీడియోలు, ఆడియోలు తమవేనని ముగ్గురు నిందితులు ఒప్పుకున్నారని ఆయన చెప్పారు. వాటన్నింటినీ మొదటి రిమాండ్ రిపోర్ట్ అప్లికేషన్ రోజే ట్రయల్ కోర్టులో సమర్పించామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలన్ని మొదట మీడియాకు వెళ్లిన తర్వాతే సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారని ఆయన వెల్లడించారు.