అర్జున్ రెడ్డి సినిమాని తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కించి సూపర్ హిట్స్ అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం బాలీవుడ్ లో డెవిల్ సినిమా చేస్తున్న ఈ డైరెక్టర్, త్వరలో తెలుగులో ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే గతంలో సందీప్ రెడ్డి, మహేశ్ బాబుతో మెకానిక్ అనే సినిమా చేయడానికి ప్రయత్నాలు చేశాడు. అది ఆగిపోయింది, ఆ తర్వాత రామ్ చరణ్ సినిమా చేస్తాడు అనే వార్తలు కూడా వచ్చాయి. సందీప్ రెడ్డి వంగ తెలుగులో మళ్లీ సినిమా చేస్తే, అది తప్పకుండా చరణ్ తోనే అనుకున్నారు. అంతగా వైరల్ అయిన ఈ వార్త జోరు కాస్త తగ్గగానే, అర్జున్ రెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తాడు అంటూ రూమర్స్ వచ్చాయి. ఈ కాంబినేషన్ లో సినిమా ఉండడం దాదాపు ఖాయమే అయినా, అది ఎప్పుడు అనే విషయంపై ఒక క్లారిటీ మాత్రం లేదు. విజయ్ కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉండడంతో, ఈ కాంబినేషన్ ఇప్పట్లో సెట్ అవ్వడం కష్టమే. తాజాగా సందీప్ రెడ్డి నెక్స్ట్ సినిమా గురించి వినిపిస్తున్న న్యూస్ ఏంటి అంటే, మెగాస్టార్ తో సినిమా చేయడం.
సూపర్ స్టార్, మెగా పవర్ స్టార్ లు అయిపోవడంతో… ఇప్పుడు ఈ వార్తలు చిరు దగ్గరికి వచ్చి ఆగాయి. సందీప్ రెడ్డి వంగ చిరుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. అయితే సందీప్ చేసింది ఒక సినిమానే, అది కూడా కల్ట్ సినిమా. అలాంటిది చిరంజీవి లాంటి లార్జర్ దెన్ లైఫ్ ఉన్న హీరోని సందీప్ రెడ్డి హ్యాండిల్ చేయగలడా అంటే కష్టమనే సమాధానమే వినిపిస్తుంది. ఇప్పటికే చిరు నటించిన సైరా సినిమాని సురేందర్ రెడ్డి సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అనే ఫీలింగ్ లో మెగా అభిమానులు ఉన్నారు. కమర్షియల్ హిట్స్ ఇచ్చిన సురేందర్ రెడ్డే, చిరు మ్యానియాని తట్టుకోలేక తడబడితే ఇక ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న సందీప్ రెడ్డి వంగ ఆ పని ఎలా చేస్తాడు అనేది చాలా మందికి ఉన్న అనుమానం. సో ఎటు చూసినా సందీప్ రెడ్డి వంగకి ఉన్న అనుభవం దృష్టిలో పెట్టుకోని చూస్తే ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడం కష్టమే. అయినా ఈమధ్య కాలంలో ఏ దర్శకుడిపై రానన్ని పుకార్లు సందీప్ రెడ్డి పైనే వినిపిస్తున్నాయి. మరి వీటికి చెక్ పెడుతూ సందీప్ ఏదైనా సినిమా అనౌన్స్ చేస్తాడేమో చూడాలి.