ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సైనిక శునకం ‘జూమ్’ ఇకలేదు. జమ్మూ కశ్మీర్ అనంత నాగ్ జిల్లాలోని మిలిటరీ వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఈ జాగిలం గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మరణించిందని సైనికాధికారులు తెలిపారు. ఉదయం పదకొండున్నర గంటల వరకు కూడా చికిత్సకు అది స్పందిస్తూనే వచ్చిందని, కానీ కొద్దిసేపటికి హఠాత్తుగా వేగంగా శ్వాస తీస్తూ కుప్పకూలిపోయిందని వారు చెప్పారు.
ఇటీవల అనంత్ నాగ్ జిల్లా లోని కొకెర్ నాగ్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులను జవాన్లు మట్టుబెట్టారు. మొదట ఉగ్రవాదులు దాక్కున్న ఇంట్లోకి జూమ్ ని వదలగా వారి జాడను పసిగట్టి అది వారిపై దాడి చేసింది. అయితే మూలన నక్కి ఉన్న ఉగ్రవాదులు రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడింది.
అయినప్పటికీ అది వారిని వదలలేదని.. ఆలోగా తమ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని సైనికాధికారులు తెలిపారు. వెంటనే జూమ్ ని సైనిక వెటర్నరీ ఆసుపత్రికి తరలించామన్నారు.
ఇది త్వరగా కోలుకోవాలని ఇంతకుముందు వీరు ఆకాంక్షించారు, కానీ వారి ఆకాంక్ష ఫలించలేదు. జూమ్ మృతికి సైన్యం తీవ్ర విచారం వ్యక్తం చేసింది, ఒకప్పుడు ఈ జాగిలానికి కఠిన శిక్షణ ఇచ్చామని, ఉగ్రవాదులను ఎలా గుర్తించాలో, ఎలా పట్టుకోవాలో నేర్పించామని జవాన్లు గుర్తు చేసుకున్నారు. ధైర్య సాహసాలకు పెట్టింది పేరుగా జూమ్ ని అభివర్ణించేవారమని పేర్కొన్నారు.