భారతీయ సైన్యానికి చెందిన ఆర్మీ హెలికాప్టర్ గురువారం అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భాను రెడ్డి, మేజర్ జయంత్ మరణించినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. వారి కుటుంబాలకు ఇండియన్ ఆర్మీ అండగా నిలుస్తుందని తెలిపారు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో ఆ హెలికాప్టర్ కు సంబంధాలు తెగిపోయినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని బోమిడిలా వద్ద ఆపరేషనల్ సోర్టీ నిర్వహిస్తున్న సమయంలో చీతా హెలికాప్టర్ తో కాంటాక్ట్ తెగిపోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించడం జరిగిందని తెలిపారు.
కాగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల్ వినయ్ భాను రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు. సైన్యంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వినయ్ భాను రెడ్డి మరణించడం పట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులు తీవ్ర విషాదం వ్యక్తం చేశారు.
అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హెలికాప్టర్ సెంగే గ్రామం నుండి మిస్సమారీకి వెళుతుండగా మధ్యలో కాంటాక్ట్ కోల్పోయిందని.. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు, దిరాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగ్జాలెప్ గ్రామస్థులు ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ను కనుగొన్నట్లు చెప్పారు. ఆ ప్రాంతంలో సిగ్నల్ లేదని, 5 మీటర్ల మేర విజిబిలిటీతో అత్యంత పొగమంచుతో కూడిన వాతావరణం ఉందని పోలీసులు తెలిపారు.