డేటా చోరీ కేసులో రంగంలోకి దిగింది ఆర్మీ. సైబరాబాద్ పోలీసులతో రక్షణ రంగ ఉన్నతాధికారులు ఆదివారం భేటీ అయ్యారు. 2.55 లక్షల మంది తమ ఉద్యోగుల వివరాలు ఉండటంపై ఆరా తీశారు. జాతీయ భద్రతకు ముప్పు కావడంతో సీరియస్ గా దృష్టి సారించింది ఆర్మీ. నిందితుల వద్ద జాతీయ రాజధాని పరిధిలో పని చేసే 2.55 లక్షల మంది డేటా లభ్యమైంది. తమ ఉద్యోగుల డేటా నకలు స్వాధీనం చేసుకున్నారు ఆర్మీ అధికారులు. డేటా లీకేజీ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సైబరాబాద్ పోలీసులు.
కేసులో భాగంగా డేటా ప్రొవైడర్ జస్ట్ డయల్ ను కూడా సైబరాబాద్ పోలీసులు విచారించనున్నారు. సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన సిట్ ద్వారా కేసు విచారణ జరుగుతోంది. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న డేటాను తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అండ్ సైబర్ సేఫ్టీ ద్వారా పోలీసులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ లో డేటాకు సంబంధించి నగరానికి చెందిన వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.
కాగా దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్న సైబర్ క్రిమినల్స్ ని మార్చి 23న సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆధార్, పాన్, బ్యాంకు డీటెయిల్స్ వంటి వ్యక్తిగత డాటా కొట్టేస్తున్న ముఠాని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి డేటాను రికవరీ చేశారు. వీరిపై హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వేల సంఖ్యలో కేసులు నమోదయినట్లు తెలిపారు. బ్యాంకులు, సిమ్ కార్డుల పేరుతో మెసేజ్ లతో పాటు లింకులను పంపుతున్నట్లు గుర్తించారు పోలీసులు.
సైబర్ నేరగాళ్లు పంపిన లింకులను తెలియక క్లిక్ చేసిన వారి వ్యక్తిగత డేటాను మొత్తం చోరీ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. సంబంధం లేకపోయినా అనవసర మెసేజ్ లు పంపుతూ కోట్ల మంది డేటాను చోరీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి మెసేజ్ లపై ప్రతిఒక్కరూ అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు. ఇందులో ఆర్మీ ఉద్యోగులకు సంబంధించిన డేటా కూడా ఉండటంతో లేటెస్ట్ గా ఆర్మీ అధికారులు రంగంలోకి దిగారు.