జమ్మూ కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మరణించిన సైనిక అసాల్ట్ శునకం..’జూమ్’ కి శుక్రవారం జవాన్లు ఘనంగా తుది వీడ్కోలు పలికారు. ఈ నెల 10 న ఈ జిల్లాలోని ఓ ఇంట్లో దాక్కున్న టెర్రరిస్టులను పట్టుకునేందుకు భద్రతాళాలు జూమ్ తో సహా యత్నించాయి. అయితే మూలన నక్కిన ఉగ్రవాదులు దీనిపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడింది. ఆలోగా జవాన్ల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు మరణించారు.
గాయపడిన శునకాన్ని వెంటనే సైనికాధికారులు శ్రీనగర్ లోని మిలిటరీ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందిన జూమ్ నిన్న ప్రాణాలు కోల్పోయింది.
శుక్రవారం చినార్ వార్ మెమోరియల్ వద్ద ఈ శునకానికి బాదామీ బాగ్ కంటోన్మెంట్ లెఫ్టినెంట్ జనరల్ ఔజ్లా, చినార్ కోర్స్ జవాన్లు .. అమరుడైన సైనిక జవానుకు అర్పించినట్టే నివాళులు అర్పించారు.
చినార్ వారియర్స్ మెంబర్ అయిన ‘జూమ్’ రెండేళ్ల వయస్సులోనే తమ సైన్యానికి విశేష సేవలందించిందని, తన ధైర్య సాహసాలతో గొప్ప గుర్తింపు పొందిందని సైన్యం ఓ స్టేట్మెంట్ లో పేర్కొంది. ఇలాంటి టీమ్ మెంబర్ ని కోల్పోయినందుకు తామెంతో చింతిస్తున్నామని తెలిపింది.