తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత్ పట్టు బిగిస్తోంది. తాజాగా భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు నెమ్మదిస్తున్నాయి. ఇప్పుడు భారత- చైనా సరిహద్దుల్లో భారత సైనికులు పలు రకాల ఆటలు ఆడుతూ ఫిట్ నెస్ పెంచుకుంటున్నారు. తాజాగా తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత సైనికులు క్రికెట్ ఆడారు.
వీటికి సంబంధించిన ఫోటోలను భారత సైన్యం విడుదల చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాటియాలా బ్రిగేడ్ త్రిశూల్ డివిజన్‌లో అత్యంత ఎత్తులో ఉన్న ప్రాంతంలో సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మ్యాచ్ జరిగిందని ఆర్మీ పేర్కొంది.
అలాంటి వాతవరణంలో సైనికులు అత్యంత ఉత్సాహంతో క్రికెట్ ఆడారని చెప్పింది. తాము అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తున్నామని పేర్కొంది. జీ-20 విదేశాంగ మంత్రుల సదస్సులో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ మధ్య న్యూఢిల్లీలో సమావేశం జరిగింది.
ఇరు దేశాల నేతల మధ్య సమావేశం తర్వాత ఈ ఫోటోలను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. అయితే ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఏ ప్రాంతంలో జరిగిందనే విషయాన్ని మాత్రం ఆర్మీ వెల్లడించలేదు. రెండేండ్ల క్రితం గాల్వాన్ ఘటన జరిగిన ప్రాంతానికి సుమారు రెండు కిలో మీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉన్నట్టు తెలుస్తోంది.