ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ ఎయిర్ పోర్ట్ లో 300మందికి పైగా భారతీయులు పడిగాపులు కాస్తున్నారు. అందులో 200మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. కరోనా కారణంగా పిలిపీన్స్ లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. దాంతో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తోన్న విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు రెడీ అయ్యారు. కానీ మలేషియా ప్రభుత్వం ఇండియాకు వెళ్లే పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇక్కడి నుంచి భారత్ కు వెళ్లాలంటే భారత దౌత్యాధికారుల అనుమతి ఉండాల్సిందేనని మలేసియా అధికారులు తేల్చి చెప్పారు. భారత అధికారుల నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో కౌలాలంపూర్ విమానాశ్రయంలోనే నిరీక్షిస్తున్నారు.దాంతో వారు వెనక్కు వెళ్ళలేక, ఇండియాకు రాలేక విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు.
భారతీయ వైద్య విద్యార్థుల్లో 60 మందికి పైగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. తమ పరిస్థితిపై విద్యార్థులు ఇండియా ఎంబసీ అధికారులను కలిసిన ఫలితం దక్కలేదు. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించి సత్వరమే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. కాగా, తమ బిడ్డల పరిస్థితి పట్ల తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం స్పందించి అక్కడి భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.