దేశంలో 2016-20 మధ్య 3399 మత పరమైన అల్లర్ల కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. దేశంలో మత పరమైన అల్లర్లు ఎన్ని జరిగాయి, వాటికి సంబంధించిన రికార్డులను కేంద్రం నిర్వహిస్తోందా? అంటూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, బీజేపీ ఎంపీ చంద్ర ప్రకాశ్ జోషి పార్లమెంట్ లో అడిగారు.
దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పందించారు. నేషనల్ క్రైమ్ రికార్స్డ్ బ్యూరో అందించిన నివేదికలోని వివరాలను ఆయన సభకు తెలిపారు.
2020లో మతపరమైన ఘర్షణలు మొత్తం 857 జరిగాయని తెలిపారు. 2019లో ఈ సంఖ్య 438 ఉందని, 2018లో 512 , 2017లో 723, 2016లో 869 కేసులు నమోదైనట్టు చెప్పారు.
‘ ప్రస్తుతం ఉన్న క్రిమినల్ చట్టాలను సమగ్రంగా సమీక్షించి, వాటిని సమకాలీన శాంతిభద్రతల పరిస్థితులకు అనుగుణంగా మార్చడంతో పాటు సమాజంలోని బలహీన వర్గాలకు సత్వర న్యాయం అందించేందుకు పౌర కేంద్రీకృతమైన చట్టాన్ని నిర్మించడం మా ప్రభుత్వ ఉద్దేశం’ అని అన్నారు.