చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ వందల మందిని బలి తీసుకుంటుంది. ఆదివారం నాటికి ఈ వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య 811 కు చేరినట్టు చైనా అధికారికంగా ప్రకటించింది. ఒక్క హుబెయ్ ఫ్రావిన్స్ లో నే 81 మంది చనిపోయారు. ఇది 2002-3 సంవత్సరంలో SARS (సీవియర్ ఆక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ తో మరణించిన వారి కంటే ఎక్కువ. సార్స్ వైరస్ తో మరణించిన వారి సంఖ్య 774. దేశ వ్యాప్తంగా 38,198 మందికి వ్యాధి సోకినట్టు చైనా హెల్త్ కమిషన్ నిర్ధారించింది. ఒక్క హుబెయ్ ఫ్రావిన్స్ లో 27,100 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 6,188 మంది పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారిలో 780 మంది హుబెయ్ ఫ్రావిన్స్ కు చెందిన వారే.
మృతుల సంఖ్య స్థిరంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇది శుభ సూచకమని అన్నారు. అయితే ఇది అత్యంత తీవ్ర స్థాయిలో ఉందని అంచనాలు వేయడం తొందరపాటేనని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందాన్ని చైనాకు పంపింది.
కరోనా వైరస్ ను రాష్ట విపత్తుగా ఉపసంహరించుకున్న కేరళ ప్రభుత్వం 3114 మందిని అబ్జర్వేషన్ లో పెట్టినట్టు ప్రకటించింది. 45 మందిలో స్వల్ప కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది.
కరోనా వైరస్ కారణంగా హాంకాంగ్ సరిహద్దుల్లో వాణిజ్యం స్తంభించి పోయింది. దీంతో వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు.
అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు కృషి చేస్తున్నాయి. ఏ వ్యాక్సిన్ అయినా తయారు చేయడానికి చాలా కాలం పడుతుంది. తయారు చేసిన వ్యాక్సిన్ ను జంతువులకు ప్రయోగించడం, క్లినికల్ ట్రయల్స్, ఆ తర్వాత మనుషుల్లో ప్రయోగిస్తారు. అయితే అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన ఎన్నో సైంటిస్ట్ బృందాలు ఇతర దేశాల సమన్వయంతో సాధ్యమైనంత త్వరలో వ్యాక్సిన్ కనుగొనే పనిలో పడ్డారు. ఆరు నెలల్లో కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొంటామని ఆస్ట్రేలియా సైంటిస్టులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.