భద్రాద్రిలో సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సీతారాముల కళ్యాణానికి సంబంధించిన పనులను ఈ నెల 9న ఆలయ అర్చకులు ప్రారంభించారు. ఈనెల 30న జరిగే కళ్యాణానికి 180 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేయగా.. కళ్యాణానికి వాడే పట్టువస్త్రాలను ఎంతో పవిత్రంగా తయారు చేయాలనే ఉద్దేశ్యంతో ఆలయ ప్రాంగణంలోనే తయారు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
దీంతో సికింద్రాబాద్ లోని గణపతి దేవాలయం ఛైర్మన్, రాష్ట్ర పద్మశాలి సంఘం ఎస్ఎస్ జయరాజు.. భద్రాద్రి రామయ్య సన్నిధిలోనే మగ్గంతో స్వయంగా సీతారాములకు పట్టు వస్త్రాలు తయారు చేసి ఇవ్వడానికి ముందుకొచ్చారు. పద్మశాలీల సహకారంతో అనేక దేవాలయాలకు ఉచితంగా పట్టు వస్త్రాలు తయారు చేసి అందిస్తున్నామన్నారు.
ఈ నేపథ్యంలోనే మూడు రోజుల క్రితం పట్టుపోగులకు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివారం రామయ్య సన్నిధికి వాటిని తీసుకొచ్చారు. ఆలయంలో మగ్గానికి పూజలు చేసిన తర్వాత వస్త్రాల తయారీని ప్రారంభించారు.
కళ్యాణంతో పాటు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి సీతారాములకు, లక్ష్మణ, హనుమంతులకు పట్టు వస్త్రాలను భద్రాద్రిలోనే తయారు చేసి ఇవ్వనున్నారు. మొత్తం ఎనిమిది మంది చేనేత నిపుణులు ఆదివారం నుంచి వస్త్రాలు తయారీ ప్రారంభించి ఈ నెల 25 లోపు స్వామివారి సన్నిధికి అందించనున్నారు. భద్రాచలంలోని భక్త రామదాసు జ్ఞాన మందిరంలో మగ్గం ఏర్పాటు చేసి అక్కడే పట్టు వస్త్రాలు తయారు చేస్తున్నారు.