– మునుగోడు ఉప ఎన్నికకు ఏర్పాట్లు
– యాదాద్రి జిల్లాలో ఎలక్షన్ కోడ్
మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక దగ్గర పడుతోంది. ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో యాదాద్రి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈనెల 14 వరకు నామినేషన్ పక్రియ కొనసాగనుంది. ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే.. వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈనెల 3న షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ.. శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 14 వరకు నామినేషన్ల ప్రక్రియ ఉండగా.. 15న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 17 వరకు గడువు పెట్టారు. నవంబర్ 3న పోలింగ్.. 6న ఫలితాలు వెలువడతాయి. నవంబర్ 8తో ఉప ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగుస్తుంది.
ఈనెల 4 కంటే ముందు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మునుగోడు ఉప ఎన్నికలో ఓటు వేసే అవకాశం కల్పించారు. నియోజకవర్గంలో అదనపు టీమ్ లతో కలిసి పని చేస్తున్నారు అధికారులు. నామినేషన్ నుంచి ఎన్నిక పూర్తై కౌంటింగ్ వరకూ సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలతో ప్రతిదీ చిత్రీకరిస్తున్నారు. నియోజకవర్గంలో 298 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు అధికారులు.
ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని పార్టీలన్నీ తెగ కష్టపడుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేసి.. విస్తృతంగా ప్రచారంలో మునిగిపోయింది. ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటోంది. అగ్రనేతల టూర్లు కొనసాగుతున్నాయి. మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అంటూ హస్తం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తోంది.
టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించకపోయినా మంత్రి జగదీష్ రెడ్డి బాధ్యతలను తన బుజాలపై వేసుకుని విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా టీఆర్ఎస్ విభజించింది. ఒక్కో యూనిట్ బాద్యతలను ఒక్కో బృందానికి అప్పగించింది. ఇక బీజేపీ అయితే.. రాజగోపాల్ ఇమేజ్ తో గట్టెక్కాలని చూస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా కలిసొస్తుందని భావిస్తోంది.