మహబూబాబాద్ మున్సిపాలిటీలో 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవి నాయక్ హత్య కేసును 24 గంటలు తిరగక ముందే ఛేదించారు పోలీసులు. కేసులో ప్రధాన నిందితులు తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ వ్యాపారాలను అడ్డుకొంటున్నాడనే అక్కసుతోనే రవిని హత్య చేసినట్టుగా నిందితులు ఒప్పుకొన్నారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ లోని పత్తిపాక నుండి బానోత్ రవి నాయక్ బైక్ పై వెళ్తున్నాడు. పక్కా ప్లాన్ వేసిన నిందితులు ట్రాక్టర్ ను అడ్డు పెట్టి.. గొడ్డలితో నరికి హత్య చేసినట్టు అంగీకరించారని ఎస్పీ వెల్లడించారు. బానోతు రవి, విజయ్, అరుణ్ లతో కలిసి గతంతో రవి కూడా కలప, బియ్యం, ఇసుక వంటి అక్రమ వ్యాపారాల్లో బాగస్వామిగా ఉండేవాడు. అయితే వీరి మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో విజయ్, అరుణ్ లు వ్యాపారం నిర్వహిస్తున్నారు. కాగా.. విజయ్, అరుణ్ లు ఈ అక్రమ వ్యాపారాలు నిర్వహించకుండా బానోతు రవి అడ్డుపడుతున్నాడు. ఇటీవలే ఓ లారీ కలపలోడును రవి పోలీసులకు పట్టించాడు.
దీంతో కక్ష పెంచుకొన్న అరుణ్, విజయ్ లు.. రవిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. అందుకు వారికి సపోర్ట్ గా మరో ఏడుగురి సహాయం కూడా తీసుకొన్నారు. అనుక్షణం రవి కదలికలపై నిఘా ఏర్పాటు చేసిన అరుణ్, విజయ్ లు.. పత్తిపాక నుండి ఒంటరిగా వెళ్తున్న రవికి ట్రాక్టర్ ను అడ్డు పెట్టి గొడ్డలితో దాడికి దిగినట్టుగా ఎస్పీ తెలిపారు.
ఈ కేసులో అరుణ్, విజయ్ లతో పాటు వారికి సహకరించిన భూక్యా వినయ్, భూక్యా అరుణ్, అజ్మీరా బాలరాజు, గగులోత్, చింటూ, కారపాటి సుమంత్, అజ్మీరా కుమార్, గగులోత్ బాపుసింగ్ లు సహా మొత్తం ఏడుగురిని అందుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్టు ఎస్పీ తెలిపారు. నిందితుల నుండి గొడ్డలి, తల్వార్, ట్రాక్టర్, కారు స్వాధీనం చేసుకొన్నట్టు స్పష్టం చేశారు.