తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని మండిపడ్డారు విద్యార్థి జన సమితి నాయకులు. ఇటీవల సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి.. అనంతరం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు స్వేచ్ఛ వాయువులలో జీవించకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజలు హక్కులతో బ్రతకడం ఇష్టంలేక నియంతృత్వంగా, నిరంకుశంగా పాలన సాగించడానికి రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ చేసే పాపాలకు రాజ్యాంగం అడ్డు వస్తోందనే దురుద్ధేశ్యంతో భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ను అవమానించిన కేసీఆర్ ను ప్రగతి భవన్ ముందు ఉరితీసినా తప్పులేదన్నారు. తప్పును ఒప్పుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు ఉద్యమాలు ఆగవని స్పష్టం చేశారు.
ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు..నిరసన కారులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో విద్యార్థి జన సమితి నాయకులు బాలెంల జీవన్, మేకల పవన్, డప్పు గోపి, బాలెంల చైతన్య తదితరులు ఉన్నారు.