పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాంపల్లి లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. నిరసనలో పాల్గొన్న మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీసు స్టేషన్ కి తరలించారు పోలీసులు.
తెలంగాణ మహిళ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.. ఒక్కసారిగా బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు.. మహిళ కాంగ్రెస్ చైర్మన్ సునీతారావ్ తో పాటు పలువురు మహిళలను అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు ప్రజలపాలిట శాపంగా మారాయని మహిళా కాంగ్రెస్ ఛైర్మన్ సునీతా రావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై విపరీతంగా ధరల భారం వేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ఛార్జీలు పెంచడంతో సామాన్యుడి జీవితం ఆగాదంలోకి నెట్టివేయబడిందని అన్నారు. గతంలో గ్యాస్ పై సబ్సిడీ ఇచ్చి పేదలను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు. కానీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలపై ఛార్జీల భారం మోపుతున్నాయని విమర్శించారు. ఈ భారం తగ్గించే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.