ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్ తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమోద ముద్ర వేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీశ్ సిసోడియాను సీబీఐ రెండు రోజుల క్రితం అరెస్టు చేసింది.
ఆయనకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఐదు రోజుల సీబీఐ కస్టడీ విధించింది. దీంతో ఆయన ఇప్పుడు సీబీఐ కస్టడీలో ఉన్నారు. తన అరెస్టును సవాల్ చేస్తూ ఆయన ఈ రోజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
ఈ పిటిషన్ పై ఈ రోజు మధ్యాహ్నం విచారణ జరిగింది. ఆయన బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ముందు ఢిల్లీ హైకోర్టును సంప్రదించాలని ఆయనకు సుప్రీం కోర్టు సూచించింది. దీంతో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
సిసోడియా, జైన్ రాజీనామాల నేపథ్యంలో మంత్రి వర్గంలో కొత్తగా ఇద్దరికి కేజ్రీవాల్ అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సిసోడియా వద్ద 18 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. సత్యేంద్ర జైన్ అరెస్టు నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న వైద్య శాఖను సిసోడియాకు అప్పగించారు.