పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్థ చటర్జీని అరెస్టు మెమోలో ఈడీ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. అరెస్టు చేసిన తర్వాత చటర్జీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మూడు సార్లు ఫోన్ కాల్ చేసినట్టు అరెస్టు మెమోలో పేర్కొన్నారు.
చటర్జీని రాత్రి 1.55 గంటలకు అరెస్టు చేసినట్టు తెలిపారు. రాత్రి 2.33 గంటలకు మొదటి కాల్ సీఎం మమతా బెనర్జీకి చటర్జీ చేశారని పేర్కొన్నారు. కానీ ఆ ఫోన్ కాల్ కు దీదీ సమాధానం ఇవ్వలేదని చెప్పారు.
ఆ తర్వాత ఉదయం 3.37 గంటలకు, ఉదయం 9.35 గంటలకు మరోసారి ఫోన్ చేసినట్టు వివరించారు. కానీ ఆ రెండు ఫోన్ కాల్స్ కు కూడా మమతా బెనర్జీ సమాధానం ఇవ్వలేదని ఈడీ పేర్కొంది.
ఎవరైనా నిందితుడిని అరెస్టు చేసినప్పుడు తన అరెస్టు గురించి తన బంధువులకు ఫోన్ లో సమాచారం అందించేందుకు నిందితునికి అనుమతి ఇస్తారని పోలీసులు తెలిపారు. అదే నియమం కింద చటర్జీకి అవకాశం ఇచ్చామని చెప్పారు.
ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. మంత్రి ఫోన్ ఈడీ అధికారులు సీజ్ చేశారని, అతను సీఎంకు కాల్ చేసే అవకాశం లేదని టీఎంసీ నేత ఫిర్హత్ హకీమ్ తెలిపారు. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో మనీలాండరింగ్ ఆరోపణలు నిజమేని తేలడంతో మంత్రి పార్థ చటర్జీని ఈడీ అధికారులు శనివారం అరెస్టు చేశారు.