రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ముఖ్యనేతల ఇళ్ల ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్లేందుకు వీల్లేకుండా తెలుగుదేశం నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలుచోట్ల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో బైండోవర్లు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. టీడీపీ ఆందోళనలను అడ్డుకోవడానికి పెద్దసంఖ్యలో మోహరించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 16 మంది టీడీపీ నాయకులను బైండోవర్ చేశారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు ఏపీ పర్యాటక అతిథి గృహానికి తరలించారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును గృహ నిర్బంధం చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుంచి గుంటూరుకు వస్తున్న హనుమంతరాయచౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. ఒంగోలులో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, కరణం వెంకటేశ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నూజివీడులో టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. 20 మంది తెదేపా కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.