కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లోక్ సభ సభ్యత్వానికి అనర్హునిగా ప్రకటించడంపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఒక మొండి నియంత, నిరక్షరాస్యుని నుంచి దేశాన్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతయినా ఉందని ఆయన ..పరోక్షంగా ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాహుల్ లోక్ సభ సభ్యతాన్ని రద్దు చేయడం పిరికి చర్య అని, జుడీషియరీ పట్ల తమకు గౌరవం ఉందని, కానీ ఈ తీర్పును తాము అంగీకరించబోమని ఆయన అన్నారు.
‘ఈ దేశంలో ప్రతివారూ భయపడుతున్నారు.. అందువల్లే ప్రజలంతా ఏకం కావాలి.. ఈ దేశం మనందరిదీ’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. రాహుల్ పై అనర్హత వేటు దిగ్భ్రాంతి కలిగించిందని, అసలే ఈ దేశం క్లిష్ట పరిస్థితుల్లో పయనిస్తోందని, వాళ్ళు (బీజేపీ నేతలు) మొత్తం దేశప్రజలనందరినీ భయకంపితులను చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ఈ మొండి అధికార దర్పానికి వ్యతిరేకంగా ఒక్కటి కావాలన్నారు. దేశంలో కేవలం ఒక్క పార్టీయే ఉండాలన్న పరిస్థితిని బీజేపీ సృష్టిస్తోందన్నారు.
ఇది నియంతృత్వం .. ఒకనాటి బ్రిటిష్ పాలకుల కన్నా బీజేపీ నాయకులు చాలా ప్రమాదకరమైన వారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. దేశాన్ని నాశనం చేసేందుకు మోడీ నాయకత్వం కింద ప్రయత్నాలు జరుగుతున్నాయని అసెంబ్లీలో కూడా ఆయన ధ్వజమెత్తారు.