న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ ఇకలేరు. ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కొద్దిరోజులుగా మూత్రపిండాలు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న జైట్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది కేంద్రంలో మళ్లీ బీజేపీ ఘనవిజయం సాధించినా, ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలో ఆయన చేరలేదు. అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్న తరువాత కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు నిరాకరించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికే పరిమితమయ్యారు. అరుణ్ ప్రాణాలు విడిచినట్టు ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశారు. అరుణ్ జైట్లీకి భార్య సంగీత, కుమార్తె సొనాలి జైట్లీ భక్షి, కుమారుడు రోహన్ జైట్లీ ఉన్నారు.