ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అరుణ్ పిళ్ళై రిమాండ్ రిపోర్టులో ఈడీ పలు కీలక విషయాలను పేర్కొంది. 17 పేజీలతో ఈ రిపోర్టును ఈడీ రూపొందించింది. బీఆర్ఎఎస్ ఎమ్మెల్సీ కవితకు లబ్ది కలిగించేందుకు పిళ్ళై అన్నీ తానై వ్యవహరించాడని, నిజానికి సౌత్ గ్రూప్ మొత్తాన్ని దగ్గరుండి నడిపించాడని తెలిపింది.
పిళ్ళై ఇతర నిందితులతో కలిసి విమాన ప్రయాణాలు చేశాడని, రాబిన్ డిస్టిల్లరీ పేరిట వ్యాపారం చేసిన ఈయన.. ఢిల్లీ పెద్దలకు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించినట్టు ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది. సౌత్ గ్రూప్ లో కవిత కూడా ఉన్నారని ఆమె పేరును కూడా రిపోర్టులో చేర్చింది.
మొత్తం లిక్కర్ పాలసీలో 12 శాతం లాభం వచ్చేలా చూసుకుని తమకు అనుకూలురైన వారికీ ఏజెన్సీలు ఇచ్చారని, ఈ 12 శాతంలో 6 శాతం లాభాలను ఆప్ కు మళ్లించారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఆప్ నేతలకు, సౌత్ గ్రూప్ సంస్థకు మధ్య రాజకీయ అవగాహన ఉన్నట్టు ఉందని వారు అభిప్రాయపడ్డారు.
అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్ రెడ్డి సహా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి సౌత్ గ్రూప్ లో ఉన్నారని ఈడీ వివరించింది. ఈ సంస్థ ప్రతినిధుల్లో పిళ్ళైతో బాటు అభిషేక్,బుచ్చిబాబు కూడా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఇక కస్టడీలో ఉన్న పిళ్ళైని కలిసేందుకు అతని భార్య, బావమరిదికి కోర్టు అనుమతినిచ్చింది.