జగన్ సర్కార్ పై బీజేపీ యుద్ధం ప్రకటించింది. కర్నూలు వేదికగా ప్రజా నిరసన సభ నిర్వహించింది. పార్టీ ముఖ్య నేతలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పాల్గొని పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందన్నారు అరుణ్ సింగ్. అందుకే 1న జీతం, పింఛన్ రావడం లేదని విమర్శించారు. ప్రభుత్వం దివాలా తీసిందంటూ మండిపడ్డారు. మద్యం, ఇసుక మాఫియా కారణంగానే ఖజానా ఖాళీ అయిందన్న అరుణ్ సింగ్.. జగన్ సర్కార్ పీఆర్సీ ద్వారా వేతనం పెంచకుండా తగ్గించడం ఏంటని ప్రశ్నించారు.
జగన్ సర్కార్ ఇప్పటికైనా అధికారం ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అరుణ్ సింగ్.
ఓటు బ్యాంకు రాజకీయాలు మానకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తే చూసూ ఊరుకోమన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ… కొడాలి నానిని మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కేసినో క్రీడలపై వైసీపీ ప్రభుత్వానికి ఎనలేని మమకారం ఉందని ఆరోపించారు.