అరుణాచల్ ప్రదేశ్‌లో భారత చైనా సరిహద్దుల దగ్గర ఇటీవల 19 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక హెలికాప్టర్లతో అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టిన సంగతి తెలిసింది . తాజాగా వారిలో ఏడుగురి అచూకీ దొరికింది. ఏడుగురిని రెస్క్యూ చేసిన అధికారులు ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు.

మిగిలిన వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తామని కురుంగ్ కుమే డిప్యూటీ కమిషనర్ బింగియా నిఘే తెలిపారు. త్వరలోనే రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటాయని ఆయన వెల్లడించారు. త్వరలోనే మిగతా వారి ఆచూకీని కూడా తెలుసుకుంటామని ఆయన చెప్పారు.
అరుణాచల్ ప్రదేశ్ లో దామిన్ సర్కిల్ దగ్గర రోడ్డు నిర్మాణ పని కార్మికులు ఈ నెల 13న కనిపించకుండా పోయారు. వాస్తవాధీన రేఖకు సమీపంలో ఈ ఘటన జరిగింది. అదే రోజు కుమే నదిలో వారిలో ఒకరి మృత దేహాన్ని అధికారులు గుర్తించారు. దీంతో అందోళన మొదలైంది.