ఎన్.ఆర్.సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) లో భాగమే ఎన్.పి.ఆర్ (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) అని రచయిత, సామాజిక కార్యకర్త అరుంధతి రాయ్ అన్నారు. ఎన్.ఆర్.సికి ఎన్.పి.ఆర్ డేటాగా ఉపయోగపడుతుందని ఆమె ఆరోపించారు. అందుకే ఎన్.పి.ఆర్ లో తప్పుడు వివరాలు ఇస్తూ దాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బుధవారం ఢిల్లీలో నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడిన ఆమె ఎన్.ఆర్.సి ముస్లింలకు వ్యతిరేకమని చెప్పారు. ” వాళ్లు మీ ఇంటికి వస్తారు..మీ పేరు..ఫోన్ నెంబర్…మీ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారు” ఈ వివరాలన్నీ ఎన్.ఆర్.సి కి ఉపయోగపడతాయి అని తెలిపారు.
ఎన్.ఆర్.సికి వ్యతిరేకంగా ప్రణాళికబద్ధంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఎన్.పి.ఆర్ సిబ్బంది మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే తప్పుడు సమాచారం ఇవ్వండి..అడ్రస్ 7 రేస్ కోర్స్ రోడ్ అని చెప్పండి. మనం లాఠీ దెబ్బలకు, బుల్లెట్ల కోసం పుట్టలేదని అరుంధతి రాయ్ అన్నారు.తాను ఎన్.ఆర్.సి గురించి ఏనాడు మాట్లాడలేదని ప్రధాన మంత్రి అబద్ధం చెప్పారు. ఎందుకంటే మీడియా ఆయనతోనే ఉంది కాబ్బటి అబద్ధం చెప్పారు అని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్.ఆర్.సి కి వ్యతిరేకంగా నిరసన తెలిపే వాళ్లు అంకితభావంతో పనిచేయాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండడంతో ఎన్.ఆర్.సి అమలు ప్రక్రియను ఎన్.పి.ఆర్ పేరుతో చేయాలని చూస్తుందని అరుంధతి రాయ్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ లో ముస్లింలను పోలీసులు టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారని…ఇంటింటికి వెళ్లి విధ్వంసాలకు, లూఠీలకు పాల్పడుతున్నట్టు తెలిపారు.