ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. గుజరాత్ పర్యటనలో ఓ వ్యక్తి ఆయనపై వాటర్ బాటిల్ తో దాడికి యత్నించాడు. కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసుకుని వెనక నుంచి బాటిల్ విసిరాడు. అది గురితప్పి కేజ్రీవాల్ ను దాటుకుని వెళ్లి పడింది.
కానీ ఆ విషయాన్ని కేజ్రీవాల్ పెద్దగా పట్టించుకోలేదు. గుజరాత్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఆప్ అధికార జెండాను ఎగురువేయాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి రెండు రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తున్నారు.
రాజ్‌కోట్‌లోని ఖోదల్‌ధామ్ ఆలయంలో నిర్వహించిన గార్భా వేడుకలకు ఆయన శనివారం హాజరయ్యారు. వేదికపైకి ఎక్కిన కేజ్రీవాల్ ప్రజలకు అభివాదం తెలిపారు. అదే సమయంలో ఆయన వైపు వెనక నుంచి ఓ నీళ్ల బాటిల్ దూసుకొచ్చింది.
అది ఆయన్ని దాటి వెళ్లి పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఆప్ నేతలు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే గుజరాత్‌లోని 33 జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రులు నిర్మిస్తామని, ఉచితంగా నాణ్యమైన చికిత్స అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.