ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను కలిశారు. రెండు రోజుల ముంబై పర్యటనలో ఉన్న ఆయన ఈ రోజు శరద్ పవార్ తో భేటీ అయ్యారు. దక్షిణ ముంబైలోని వైబీ చవాన్ సెంటర్ లో వారిద్దరూ భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్ మాన్, పార్టీ నేతలు అతిషి, రాఘవ్ చద్దా పాల్గొన్నారు. ఇటీవల ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగులపై పట్టు కోసం కేంద్రం ఓ ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చింది. దీన్ని ఆప్ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే దీనిపై ఆప్ పోరాటం మొదలు పెట్టింది.
ఈ క్రమంలో పలు పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. ముంబై పర్యటనలో భాగంగా నిన్న కేజ్రీవాల్ మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో ఆయన సమావేశం అయ్యారు. అంతకు ముందు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కూడా భేటీ అయ్యారు.
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను లాగేసుకునేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్ పై తాము చేస్తున్న పోరు మొత్తం జాతి చేస్తున్న పోరుగా ఆయన అభివర్ణించారు. తమ ప్రభుత్వం ఆమోదించిన బిల్లులన్నీ రాజ్ భవన్ లోనే ఉండిపోతున్నాయని సీఎం స్టాలిన్ చెబుతున్నారని పేర్కొన్నారు. ఇది దేశవ్యాప్త పోరాటమని స్పష్టం చేశారు.