తన సహచర మాజీ మంత్రుల అరెస్టుకు మనస్తాపం ప్రకటిస్తూ.. వారి అరెస్టులను ఖండిస్తూ ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. బుధవారం హోలీ వేడుకలు జరుపుకోరాదని నిర్ణయించుకున్నారు. ఈ రోజంతా పూజాకార్యక్రమాల్లో గడుపుతానని ఆయన ప్రకటించారు. దేశానికి మంచి జరగాలన్న ఉద్దేశంతో పూజ చేస్తున్నట్టు తెలిపిన ఆయన.. దేశాన్నిలూటీ చేస్తున్నవారు పారిపోతుండగా, మంచి చేస్తున్నవారిని అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు.
దేశంలోని పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లకు ముందు .. 65 ఏళ్లుగా దేశంలో విద్య, వైద్య రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కానీ వీరిద్దరూ తమ ప్రతిభ, గట్టి కృషితో వీటిని ఎంతగానో అభివృద్ధి పరిచారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కానీ ఇలాంటివారిని ప్రధాని మోడీ అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారన్నారు. ఇక ఈ ఉదయం రాజ్ ఘాట్ వద్ద ఆయన మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
మోడీ సహేతుకంగా వ్యవహరించడం లేదని మీరు భావించిన పక్షంలో ..హొలీ జరుపుకున్నాక మీరు కూడా ఈ దేశం కోసం ప్రార్థనలు చేయాలని ఆయన ప్రజలను కోరారు.