టీవీల్లో లేదా సినిమాల్లో.. ఎందులో అయినా సరే నటుడిగా గుర్తింపు రావాలంటే అందుకు ఎన్నో ఏళ్ల పాటు శ్రమించాల్సి ఉంటుంది. అయితే నటుడు అలీ రెజా కూడా అలాగే శ్రమ పడ్డాడు. ఈ క్రమంలోనే ఒకప్పుడు అతను జూనియర్ ఆర్టిస్టుగా చేసినా ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ ఉన్న నటుడిగా సినిమాల్లో చేస్తున్నాడు. నటుడు నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్ మూవీలోని స్టిల్ ను షేర్ చేసిన అలీ రెజా తాను ఈ పొజిషన్‌కు వచ్చేందుకు ఎంత కష్ట పడ్డానో అని చెప్పాడు.
అలీ రెజా నాగార్జునతో కలిసి వైల్డ్ డాగ్ మూవీలో నటిస్తుండగా ఆ మూవీకి చెందిన ఓ స్టిల్‌ను తాజాగా షేర్ చేశాడు. అందులో సయామీ ఖేర్‌తోపాటు పలు ఇతర నటులను చూడవచ్చు. ఆ మూవీలో వారు ఎన్ఐఏ ఆఫీసర్లుగా కనిపిస్తున్నారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అయితే అలీ రెజా ఈ సందర్బంగా కామెంట్ పెట్టాడు.
ఒకప్పుడు నాగార్జునకు చెందిన బాస్ మూవీ (2006)లో జూనియర్ ఆర్టిస్టుగా చేశానని, తరువాత బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా వెళ్లానని, ఇప్పుడు నాగార్జున పక్కన పూర్తి స్థాయిలో నటుడిగా కీలక పాత్ర పోషిస్తున్నానని తెలిపాడు. ఇందుకు కారణం నాగార్జుననే అని, ఆయనకు ఏమి ఇచ్చినా ఆ రుణం తీర్చుకోలేనని, అయినప్పటికీ నాగార్జునకు థ్యాంక్స్ చెబుతున్నానని, ఆయనకు ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని తెలిపాడు. నాగార్జునతో వైల్డ్‌డాగ్ మూవీలో చేస్తున్నందుకు తన కల నెరవేరిందని తెలిపాడు.
కాగా వైల్డ్ డాగ్ మూవీ ఇప్పటికే 70 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకోగా హిమాలయాల్లో తాజాగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ మూవీకి కొత్త డైరెక్టర్ అశిశోర్ సోలోమన్ దర్శకత్వం వహిస్తుండగా చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.