-ఢిల్లీలో భారీగా పెరిగిన కేసులు
– అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి అత్యవసర భేటీ
ఢిల్లీలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ఈ రోజు అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి సౌరవ్ భరద్వాజ్ సమీక్ష నిర్వహించారు. రేపు సీఎం కేజ్రీవాల్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారని చెప్పారు.
ఆస్పత్రుల్లో చేరే వారే సంఖ్య తక్కువగా ఉంటుండంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. ఈ రోజు సమావేశంలో కరోనా పరిస్థితిని సమీక్షించామన్నారు. ఆస్పత్రులకు వచ్చే వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి పరీక్షలు నిర్వహించాలని వైద్యులకు సూచించామన్నారు.
ఆస్పత్రులకు వచ్చే వారు మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. రేపు అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. ఆ సమావేశంలో వైద్యాధికారులకు సీఎం పలు సూచనలు, ఆదేశాలు ఇస్తారని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలో ఈ రోజు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. తాజాగా ఢిల్లీలో 300 కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది అగస్టు తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో అధికారులతో ఆరోగ్యశాఖ మంత్రి ఈ రోజు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.