– సాయన్న మృతితో ఖాళీ అయిన స్థానం
– ఇంకో 8 నెలల్లో ఎన్నికలు
– ఈలోపు ఉప ఎన్నిక ఉంటుందా?
– ఉంటే సాయన్న ఫ్యామిలీకే టికెట్ ఇస్తారా?
– రేస్ లో చాలామంది ఆశావహులు
– అప్పుడే లాబీయింగ్ లు షురూ
– సీట్ పై ఎర్రోళ్ల, నగేశ్, క్రిశాంక్ ఆశలు!
సిట్టింగ్ ఎమ్మెల్యే కాలం చేసినా.. ఉపఎన్నికకు ఛాన్స్ లేని పరిస్థితి ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజక వర్గంది. ఈ ఏడాది చివర్లోనే షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో సాంకేతికంగా కంటోన్మెంట్ కు ఉపఎన్నిక నిర్వహించే ఛాన్స్ లేదు. అయినప్పటికీ ఎస్సీ రిజర్వ్ అయిన ఈ సీటు పై చాలా మంది ఆశలు పెట్టుకోవడంతో పొలిటికల్ లాబీయింగ్ షురూ అయింది.
సాయన్న ఉండగానే అనేక మంది తమ స్థాయిలో లాబీయింగ్ చేసిన ఉదంతాలున్నాయి. సాయన్న కుమార్తె లాస్య నందిత ఓ సారి జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గా పనిచేశారు. తర్వాత రాజకీయంగా తండ్రికి చేదోడు.. వాదోడుగా ఉంటున్నారామె. తన ప్లేస్ లో కుమార్తెకు సాయన్న అసెంబ్లీ సీటు అడగొచ్చనే చర్చ కూడా ఎమ్మెల్యే బతికున్న సమయంలోనే సాగింది. దీంతో ఇప్పుడేంది పరిస్థితి అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక ఇలా ఉంటే.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఎర్రోళ్ల శ్రీనివాస్ కొంతకాలంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎర్రోళ్ల నజర్ జహీరాబాద్ పై ఉన్నట్టు సమాచారం. మరో వైపు ఉద్యమం నుంచి యాక్టివ్ గా ఉన్నగజ్జెల నగేష్ సైతం కంటోన్మెంట్ లో సొంత గ్రూప్ ను నడిపిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్నారు నగేష్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలన్నది నగేష్ ఆలోచన. ఇదే సీటుపై మరో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సైతం ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరూ కాకుండా సాయన్న కుమార్తె లాస్య కూడా రేస్ లో ఉంటారని టాక్.
అయితే గతంలో ఎమ్మెల్యేలు అనారోగ్యంతో కన్నుమూస్తే వాళ్ల కుటుంబ సభ్యులకే ఉపఎన్నికల్లో అవకాశం ఇస్తూ వస్తోంది బీఆర్ఎస్. దుబ్బాక, నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో ఆ సాంప్రదాయాన్ని కొనసాగించింది. దీంతో కంటోన్మెంట్ విషయంలో అధిష్టానం ఏం చేస్తుందనేది ప్రశ్నగా మారింది. మరోవైపు సాయన్న కుటుంబం రాజకీయాల్లో ఇక పై ఆసక్తి చూపుతుందా.. లేదా అన్నది కూడా చర్చగా మారింది. ఇది ఇలా ఉంటే..ఈ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందా.. రాదా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. రాజకీయ నిపుణుల ప్రకారం.. ఎంపీ కాని ఎమ్మెల్యే కాని చనిపోయినా లేదా రాజీనామా చేసినా ప్రజాప్రాతినిధ్య చట్టం 151 ఏ ప్రకారం ఆరు నెలల్లోపు ఆ నియోజక వర్గంలో ఉప ఎన్నిక నిర్వహించాలి.
దీని ప్రకారం ఆగష్టు 20 లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. మే నెల కంటే ముందే కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక రావాలి. కాని తెలంగాణ శాసన సభ గడువు ఈ ఏడాది డిసెంబరుతో ముగుస్తుంది. అంటే గడువు మరో పది నెలలే ఉంది. లోక్ సభ, శాసన సభ గడువు సంవత్సరం లోపు ఉంటే కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపి.. ఎన్నికలు నిర్వహించడం కష్టమని ధ్రువీకరిస్తుంది.
ఇదే కారణంతో 2018 లో ఏపీకి చెందిన 5 మంది వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామా చేసినా.. కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించలేదని కొంత మంది రాజకీయ పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. దీని ప్రకారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమన్నది వారి అభిప్రాయం.