దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు వస్తుండటంతో జనాలు అల్లాడి పోతున్నారు. దీంతో ఏదైనా చల్లని ప్రదేశానికి వెళ్లి ఓ రెండు రోజులు సేద తీరితే బాగుండు అని అంతా అనుకుంటున్నారు.
దీంతో చాలా మంది కశ్మీర్ వైపు చూస్తున్నారు. రోజుకు వేలాది మంది కశ్మీర్ కు చేరుకుంటున్నారు. అక్కడ అందమైన ప్రదేశాలను చూసి రెండు, మూడు రోజులు అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో కశ్మీర్ పర్యాటక రంగానికి అధిక ఆదాయం వస్తోంది. ముఖ్యంగా ఇక్కడ హోటళ్లు, బోటు హౌస్ లను పర్యాటకులు ముందస్తు బుకింగ్ లు చేసుకుంటున్నారు.
ఇక్కడ ఉన్న దాల్ లేక్ ను చూసి దానిలో బోటింగ్ చేస్తూ సేద తీరేందుకు పర్యాటకులు ఎగబడుతున్నారు. ఇక్కడ హౌస్ బోట్లు ఎప్పుడూ ఫుల్ గానే కనిపిస్తున్నాయి.
మొఘల్ గార్డెన్స్ లో ఎప్పుడు చూసిన అడుగుపెట్టే సందు దొరకడం లేదంటే అతిశయోక్తి కాదు. గుల్ మార్గ్, పహల్ గామ్ లాంటి కొండ ప్రాంతాల్లో ఎప్పుడు చూసిన జన సందోహం కనిపిస్తోంది.
దేశంలో వడగాలులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 3 లక్షల మందికి పైగా పర్యాటకులు కశ్మీర్ ను సందర్శించినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
శ్రీ నగర్ నుంచి రోజు సుమారు 100కు పైగా విమానాలను నడుపుతున్నారు. కశ్మీర్ కు సుమారు రోజుకు 5వేల మందికి పైగా పర్యాటకులు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.