దేశ ఆర్థిక రాజధాని ముంబైని కరోనా వణికిస్తోంది. గత నెలలో కరోనా కేసుల సంఖ్య ఐదు రెట్లు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. మంగళవారం ఒక్క రోజే 506 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన నాలుగు నెలల్లో ఇదే అత్యధిక సంఖ్య కావడం గమనార్హం.
రుతుపవన కాలం ప్రారంభం అవుతుండటంతో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధప్రాతిపదికన టెస్టింగ్ ల సంఖ్యను పెంచాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సూచనలు చేసింది.
12 నుంచి 18 ఏండ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని బీఎంసీ సూచించింది.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో గుడిపడ్వ పండుగ నేపథ్యంలో మాస్క్ ధరించడం తప్పని సరి నిబంధనను ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ఏప్రిల్ లో ప్రకటించింది. ఈ క్రమంలో గత నెల మొదటి వారంలో కేవలం 90 కేసులు నమోదయ్యాయి.
గత నెల చివరి నాటికి ఇది 506కు చేరడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి 6 న 536 కేసుల తర్వాత ఇవే అత్యధిక కేసులుగా అధికారులు వెల్లడించారు.
రోగుల నుంచి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్టు అదికారులు తెలిపారు. రాష్ట్రంలో ఏవైనా కొత్త వేరియంట్స్ వచ్చాయా, కేసుల పెరుగుదలకు గల కారణాలేంటన్న విషయాలు టెస్ట్ రిజల్ట్స్ వచ్చాకే తెలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.