ఏఐఎంఐఎం నేత అసదుద్దిన్ ఒవైసీ
ఈ దేశంలో ముస్కాన్ ఖాన్ లాంటి ముస్లిం బాలికలు ప్రమాదంలో ఉంటే అసదుద్దిన్ కూ ముప్పు ఉన్నట్టేనని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దిన్ ఒవైసీ అన్నారు. అందుకే తాను జెడ్ కేటగిరి భద్రతను తిరస్కరించినట్టు ఆయన తెలిపారు. యూపీలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

‘ నా ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున జెడ్ కేటగిరి భద్రతను తీసుకోవాలని నన్ను మీరు అడుగుతున్నారు. కానీ నాకు అలాంటి భద్రత వద్దని పార్లమెంట్ లో చెప్పాను. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేలాగా ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరాను. ముస్కాన్ ఖాన్ లాంటి వల్ల వాక్ స్వాతంత్ర్యానికి ప్రమాదం కలిగిస్తుంటే మీరు అసదుద్దిన్ కు రక్షణ ఇవ్వడం ఏంటి. ముస్కాన్ లాంటి బాలికలకు ప్రమాదం ఉంటే నాకు కూడా ముప్పు ఉన్నట్టే ” అని అన్నారు.
హిజాబ్ వివాద సమయంలో ఓ వీడియో వైరల్ అయింది. కర్ణాటకలోని ఓ కళాశాల ముందు హిజాబ్ ధరించిన ముస్కాన్ ఖాన్ అనే విద్యార్థిని వైపు ఓ వర్గానికి చెందిన విద్యార్థులు వచ్చి నినాదాలు చేయడం మొదలు పెట్టారు. దీంతో ఆమె ప్రతిగా అల్లహో అక్బర్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఈ ఘటన జరిగిన తర్వాత ముస్కాన్ ఖాన్ తో అసదుద్దిన్ ఒవైసీ మాట్లాడారు. అప్పటి నుంచి ఆమెతో కాంటాక్ట్ లో ఉన్నారు. ఈ విషయంపై ఆమె, ఆమె తల్లిదండ్రులతో ఒవైసీ మాట్లాడారు. ఆమె తన చదువు విషయంలో స్థిరంగా ముందుకు సాగాలని కోరకుంటున్నట్టు ఆమె తల్లిదండ్రులకు తెలిపారు.