ప్రధాని నరేంద్ర మోడీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల పరిస్థితిపై చర్చను కోరుతూ ఐరాస మానవ హక్కుల మండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ హాజరు కాలేదు.
దీంతో ప్రధాని మోడీపై ఓవైసీ ట్విట్టర్ ద్వారా తీవ్రంగా ఫైర్ అయ్యారు. వీఘర్ ముస్లింల సమస్యపై ఓటు వేయకుండా చైనాకు సాయం చేయాలని భారత్ ఎందుకు నిర్ణయం తీసుకుందో ప్రధాని మోడీ వివరిస్తారా ? అని ప్రశ్నించారు.
జీ జిన్ పింగ్‌ను ప్రధాని మోడీ 18 సార్లు కలిశారని, అయినప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు. జిన్‌పింగ్‌తో ఈ విషయం మాట్లాడటానికి ప్రధాని మోడీ ఏమైనా భయపడుతున్నారా? అని అడిగారు.
చైనాలోని జింజియాంగ్‌లో ప్రాంతంలో వీఘర్ ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దీనిపై చర్చించాలని తీర్మానాన్ని ప్రతిపాదించగా దాన్ని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి తిరస్కరించింది.
ఓటింగ్ సమయంలో భారత్, మలేసియా, ఉక్రెయిన్ సహా 11 దేశాలు గైర్హాజరయ్యాయి. మొత్తం 19 దేశాలు వ్యతిరేకంగా తమ ఓటును వేశాయి. ఈ తీర్మానాన్ని కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్, బ్రిటన్, అమెరికాలు ప్రతిపాదించాయి.