అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 18 ఏళ్ల వయసున్న వారు వ్యాపారాలు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకోవచ్చు కానీ.. పెళ్లి మాత్రం చేసుకోకూడదా..? అని ప్రశ్నించారు.
అమ్మాయిల పెళ్లి వయసు పెంచే బదులు అబ్బాయిల వివాహ వయసు 21 సంవత్సరాల నుంచి.. 18 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు ఓవైసీ. దేశంలో ప్రతి నలుగురు అమ్మాయిలలో ఒకరికి 18 ఏళ్లలోపే పెళ్లి చేస్తున్నారు.. వీలైతే వాటిని ఆపాలి అంతేకానీ ఈ అర్ధంలేని నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేమొద్దని మండిపడ్డారు.
నిజంగా మహిళలపై ప్రధానికి ప్రేమ ఉంటే వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకుని మెరుగు పరిచేందుకు అవకాశాలు కల్పించాలన్నారు అసద్. మహిళలకు ఓటు వేసే హక్కును కూడా 18 నుండి 21కి పెంచగలరా అని ప్రశ్నించారాయన.