బీజేపీపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘టిప్పు ఎక్స్‌ప్రెస్’ పేరును ‘వడయార్ ఎక్స్‌ప్రెస్’గా మార్చడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బెంగళూరు నుంచి మైసూర్ వెళ్లే ట్రైన్ టిప్పు ఎక్స్ ప్రెస్ పేరును వడయార్ ఎక్స్ ప్రెస్‌గా రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం మార్చింది.
బీజేపీకి యజమానులైన బ్రిటీష్ వారికి ఎదురొడ్డి పోరాడి వారికి కోపం తెప్పించినందుకు రైలు పేరును మార్చారని ఆయన విమర్శించారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా టిప్పు యుద్దాలు చేశారన్న కోపం కాషాయ పార్టీలో ఉందన్నారు.
టిప్పు సుల్తాన్ వారసత్వాన్ని కమలం పార్టీ ఎప్పటికీ తుడిచివేయలేదన్నారు. టిప్పు బతికుండగా బ్రిటీష్ వారిని భయపెట్టారని, ఇప్పుడేమో బ్రిటిష్ బానిసలను భయపెట్టారని ఆయన బీజేపీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
టిప్పు ఎక్స్‌ప్రెస్ పేరును మార్చాలని ఈ ఏడాది జూలైలో మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా రైల్వే శాఖ మంత్రిని కోరారు. దీనిపై రైల్వే శాఖ స్పందించి టిప్పు ఎక్స్ ప్రెస్ పేరును మార్చింది. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
శుక్రవారానికి శుభవార్త.. ఇప్పుడు టిప్పు ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు వడయార్ ఎక్స్ ప్రెస్ పేరుతో మీకు సేవలందిస్తుందని ఆయన అన్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి ప్రయత్నాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు .
ముస్లిం జనాభా పెరగడం లేదని, పడిపోతుందన్నారు. కండోమ్ ఎక్కువగా వాడుతున్నది ఎవరు..? మనమే కదా అని పేర్కొన్నారు. ఈ విషయంపై మోహన్ భగవత్ మాట్లాడరని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ బీజేపీ సర్కార్ ఎక్కడ ఉన్నా, ముస్లింలు బహిరంగ జైలులో జీవిస్తున్నట్టు అనిపిస్తోందన్నారు. ముస్లిం కన్నా రోడ్డు పక్కన కుక్కకే ఎక్కవ గౌరవం ఇస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.