వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుకూలంగా కోర్టు తీర్పునివ్వటంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పు ప్రార్థనా స్థలాల చట్టం 1991ని ఉల్లంఘించినట్టు అవుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే బాబ్రీ మసీదు వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిచినట్టు అవుతుందని స్పష్టం చేశారు.
బాబ్రీ మసీదు తర్వాత మరో మసీదును కోల్పోవటానికి తాము సిద్ధంగా లేమని ఒవైసీ తేల్చి చెప్పారు. వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, మసీద్ కమిటీలు సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఒవైసీ అన్నారు. మతపరమైన స్థలాల స్వభావాన్ని మార్చాలనుకుంటున్న వ్యక్తులపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరారు.
1991 నాటి ప్రార్థనాస్థలాల చట్టం కింద ఏ మతానికి చెందిన ఏ ప్రార్థనా మందిరాన్ని లేదా స్థలాన్ని మరో మతం లేదా ఏ వర్గమైనా మార్పిడి చేయడానికి వీలు లేదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన 1947 ఆగస్టు 15 నాటి చట్టాన్ని కూడా గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తులను దోషులుగా కోర్టు భావించిన పక్షంలో వారికీ మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఒవైసీ వివరించారు.
వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఈ జ్ఞాన్ వాపి మసీదు ఉంటుంది. ఇది ఒక హిందూ దేవాలయం అంటూ.. 2021లో ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ వేశారు. మసీదు వెలుపలి గోడపై ఉన్న శృంగార గౌరి, గణేశ్, హనుమాన్, నంది విగ్రహాలను ప్రతిరోజు పూజించుకునేందుకు అనుమతించాలని పిటిషన్ లో కోరారు. ఈ నేపథ్యంలో జ్ఞానవాపి మసీదులో సర్వే కొనసాగాలని, ఈ నెల 17 కల్లా దీనిపై నివేదిక సమర్పించాలని కోర్టు గురువారం ఆదేశించింది.
సర్వే కమిషన్‌కు కోర్టు ఇద్దరు లాయర్లను కూడా నియమించింది. ఈ వివాదాస్పద స్థలం వద్ద సర్వే పర్యవేక్షణ బాధ్యతను కమిషనర్ అజయ్ మిశ్రా చూస్తున్నారు. ఈయనను మార్చాలన్న మసీదు కమిటీ కోరికను తిరస్కరించింది. అలాగే, ఏ కారణం వల్లనైనా ఙ్ఞానవాపి మసీదు వివాదానికి సంబంధించి సర్వేను జాప్యం చేయరాదని కోర్టు జిల్లా అధికారులను ఆదేశించింది. అడ్వొకేట్ కమిషనర్‌గా అజయ్ కుమార్ మిశ్రా కొనసాగుతారని, ఆయనకు సహకరించేందుకు విశాల్ సింగ్, అజయ్ ప్రతాప్ సింగ్ అనే మరో ఇద్దరు అడ్వొకేట్ కమిషనర్లని నియమిస్తున్నట్టు కోర్టు న్యాయమూర్తి రవికుమార్ దివాకర్ పేర్కొన్నారు.