తనకు కేటాయించిన జెడ్ కేటగిరీ భద్రతను తిరస్కరించారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. దానికి బదులుగా దేశంలో మత సామరస్యాన్ని పునరుద్ధరించాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కోరారు. కాల్పులు జరిపిన వారిని చూసి భయపడట్లేదని.. ట్రాక్ నుంచి పక్కకు తప్పుకోనని అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలే బ్యాలెట్ ద్వారా వారికి తగిన సమాధానం చెప్తారని స్పష్టం చేశారు.
మీరట్ లో గురువారం ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్తుండగా అసద్ పై కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో ఆయన క్షేమంగా బయటపడ్డారు. కారు టైర్ పంక్చర్ కావడంతో వేరే వాహనంలో ఢిల్లీకి వెళ్లారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన అధికారులు అసదుద్దీన్ భద్రత దృష్ట్యా సీఆర్పీఎఫ్ బలగాలతో జెడ్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మరోవైపు అసద్ పై కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఎంఐఎం పార్టీ కాల్పులకు నిరసనగా పాతబస్తీ బంద్ కు పిలుపునిచ్చింది.
ఇప్పటివరకు కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్లో ఓ వ్యక్తి నోయిడా నివాసి. గతంలో అతనిపై హత్యాయత్నం కేసు ఉంది.