సంచలనంగా మారిన సరూర్ నగర్ పరువు హత్య విషయమై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నాగరాజు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆశ్రిన్ సుల్తానా తన ఇష్టపూర్వకంగానే నాగరాజును పెళ్లి చేసుకుందని.. అందులో తప్పు పట్టడానికి ఏం లేదని వ్యాఖ్యానించారు. సుల్తానా సోదరుడు ఆమె భర్తను హత్య చేయడం క్రూరమైన చర్య అని పేర్కొన్నారు.
రాజ్యాంగం ప్రకారమైనా, ఇస్లాం ప్రకారమైనా.. ఓ మనిషిని హత్య చేయడం నేరపూరితమైన చర్యేనని అన్నారు. ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడ ముస్లింలపై దాడులు జరిగినా స్పందించే ఒవైసీ.. సరూర్ నగర్ ఘటనపై ఎందుకు స్పందించట్లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించిన దానికి స్పందిస్తూ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు వేరే రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి ఓవైసీ కామెంట్స్ చేశారు.
హత్య ఘటనలో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని.. తాము హంతకుల పక్షాన నిలబడేవాళ్లం కాదని తేల్చి చెప్పారు. ఘటనపై స్పందించకపోతే హత్యకు మద్దతునిచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హత్య ఘటనను ఖండిస్తూ ఓవైసీ స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదిలా ఉంటే.. సరూర్ నగర్ లో బిల్లపురం నాగరాజు పరువు హత్యపై గవర్నర్ తమిళిసౌ సౌందరరాజన్ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. జాతీయ ఎస్సీ కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, హైదరాబాద్ కలెక్టర్లకు నోటీసలు జారీ చేసింది.