ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి అనుకుని దక్షిణ అండమాన్ సముద్రంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా పయనించి.. శనివారం ఉదయానికి వాయుగుండంగా మారింది. దీనికి ‘అసాని’ అని పేరు పెట్టారు వాతావరణ శాఖ అధికారులు. ఇది ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారనుందని తెలిపారు.
ప్రస్తుతం ఈ తుపాను బంగాళాఖాతంలో ఒడిశాలోని పూరీ తీరానికి వాయవ్య దిశగా 1,180, విశాఖపట్నానికి 1,140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా తీరం వైపు కదులుతోందని వెల్లడించారు అధికారులు. దీని ప్రభావంతో ఈ నెల 10,11 తేదీల్లో ఒడిశా దక్షిణ, ఏపీ ఉత్తర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు
అలాగే, తీరం వెంట గంటకు 40 నుండి 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోంది.
అయితే, తీరాన్ని తాకే అవకాశం ప్రస్తుతానికి లేదని అభిప్రాయపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఇది తీవ్ర వాయుగుండంగా మారిందని అన్నారు. తుఫాన్ సమీపించిన సమయంలో తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు దీని ప్రభావానికి గురయ్యే రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు స్పష్టం చేశారు.