హైదరాబాద్ లో మరో డ్రగ్స్ కేసు బయటపడింది. ఈసారి రాడిసన్ బ్లూ పబ్ దీనికి వేదికైంది. ఎప్పట్లానే ఈసారి కూడా పలువురు టాలీవుడ్ ప్రముఖుల పేర్లు తెరపైకొచ్చాయి. ఇందులో భాగంగా హీరో అశోక్ గల్లా పేరు కూడా బయటకొచ్చింది. అతడి పేరు బయటకొచ్చిన వెంటనే గల్లా కుటుంబ సభ్యులు రియాక్ట్ అయ్యారు. అశోక్ అస్సలు ఆ స్పాట్ లో లేడన్నారు. ఇది జరిగిన 24 గంటల్లోనే సదరు అశోక్ ప్రెస్ మీట్ పెట్టాడు.
అశోక్ ప్రెస్ మీట్ అనగానే అంతా డ్రగ్స్ కేసుకు సంబంధించి అనుకున్నారు. అయితే అశోక్ మాత్రం చాలా తేలిగ్గా తీసుకున్నాడు. తను అసలు పబ్ కు వెళ్లలేదని, ఫిజియోథెరపీ చేయించుకొని ఇంటికొచ్చి మొబైల్ ఆన్ చేసేసరికి వరుసపెట్టి మెసేజీలు, కథనాలు వచ్చాయంటూ నవ్వేశాడు. మరి అలాంటప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావని ప్రశ్నించింది మీడియా.
రేపు అశోక్ గల్లా పుట్టినరోజు అంట. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్షన్ ఏర్పాటుచేశాడు ఈ హీరో. పుట్టినరోజు అన్నప్పుడు కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటిస్తారు ఎవరైనా. అశోక్ గల్లా కూడా అలా కొత్త సినిమాలు ఏమైనా ప్రకటిస్తాడేమోనని ఆశగా ఎదురుచూసింది మీడియా. కానీ మరోసారి తుస్సుమనిపించాడు గల్లా.
ప్రస్తుతం 2-3 సినిమాలపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే వాటిని ప్రకటిస్తానని చెప్పాడు అశోక్. సినిమాలు కూడా ప్రకటించనప్పుడు మరి ప్రెస్ మీట్ ఎఁదుకు పెట్టినట్టు? దీనికి గల్లా అశోక్ వద్ద సమాధానం లేదు. చిట్ చాట్ కోసం పిలిచానంటూ ముక్తాయించాడు ఈ హీరో. చూస్తుంటే.. డ్రగ్స్ కేసుతో ఊహించని విధంగా వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం కోసం, అశోక్ ఇలా ప్రెస్ మీట్ పెట్టినట్టు అనిపించింది.