ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్ బౌలర్లు రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తమ స్థానాలకు మెరుగు పరుచుకున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో వారి పాయింట్ల సంఖ్య పెరిగింది. తాజాగా బౌలర్ల విభాగంలో అశ్విన్ 864 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకు వచ్చాడు.
మరోవైపు రవీంద్ర జడేజా చాలా కాలంగా జట్టుకు దూరమయ్యారు. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫితో ఆయన మరోసారి టీమ్‌లోకి వచ్చారు. రెండు టెస్టులో ఏకంగా పది వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ర్యాంకింగ్‌లో ఏడు స్థానాలు ఎగబాకాడు.
జడేజా టాప్ 10లోకి వచ్చాడు. ప్రస్తుతం 763 పాయింట్లతో జడేజా 9వ స్థానంలో నిలిచాడు. రెండున్నర సంవత్సరాల తర్వాత జడేజా టాప్ 10లోకి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక మరో బౌలర్ బుమ్రా కూడా టాప్ 10లోనే కొనసాగుతున్నాడు.
తాజా ర్యాంకుల్లో 795 పాయింట్లతో బుమ్రా ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. రెండు స్థానాలు దిగజారి ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ సీమర్ జేమ్స్ ఆండర్సన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఇక బ్యాటర్ల విభాగంలో ఆస్ట్రేలియా ప్లేయర్ మార్నస్ లబుషేన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండు, మూడు స్థానాల్లో స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా), బాబర్ ఆజం(పాకిస్థాన్ కెప్టెన్) నిలిచారు. టీమ్ఇండియా బ్యాటర్లు రిషబ్ పంత్ (6), హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 7వ స్థానాల్లో కొనసాగుతున్నారు.