పొలం దున్నేటప్పుడు లంకె బిందెలు దొరకడం పాతకాలం సినిమాల్లో ఎక్కువగా కనిపించేవి. అప్పుడప్పుడు రియల్ గానూ ఇవి జరుగుతుంటాయి. అలాగే. పురాతన కాలం నాటి విగ్రహాలు కనిపిస్తుంటాయి. తాజాగా ఓ రైతుకు విచిత్రమైన ఆయుధాలు దొరికాయి. ఇవి.. 3,800 సంవత్సరాల క్రితం నాటివని అధికారులు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి జిల్లాలోని గణేశ్ పుర గ్రామంలో బహదూర్ సింగ్ అనే వ్యక్తి రైతు ఉన్నాడు. అతనికున్న వ్యవసాయ భూమి దున్నుతుండగా పురాతన వస్తువులు కనిపించాయి. వెంటనే అధికారులకు సమాచారం అందించగా.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. అసలు.. ఇవేంటి? ఎప్పటివి అని పరిశోధన చేసింది. దీంతో ఇవి 3,800 సంవత్సరాల నాటివని తేలింది.
వారం రోజుల పాటు అధికారులు వీటిపై పరిశోధన జరిపారు. 77 రాగి వస్తువులు(ఆయుధాలు), కుండలు, వంట కొలిమిని స్వాధీనం చేసుకున్నారు. రాగి వస్తువుల్లో 3 రకాల కత్తులతోపాటు ఈటెలు, 16 మానవ బొమ్మలు ఉన్నాయి. రాగి వస్తువుల స్వచ్ఛత 98 శాతం వరకు ఉంది. వీటి సైజ్, ఆకృతి ఆధారంగా పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.
ఇవి చాల్కోలిథిక్ కాలం నాటివి అని పరిశోధకులు ప్రాథమికంగా చెబుతున్నారు. వస్తువులు దొరికిన ప్రాంతంలో గతంలో సైనికుల శిబిరం ఉండేదని అనుమానిస్తున్నారు. వారు గారిక్ కుండల సంప్రదాయానికి సంబంధించిన ప్రజలు అయి ఉంటారని వారి కాలంలోని ప్రజలు రాగితో చేసిన ఆయుధాలను ఉపయోగించేవారని చెబుతున్నారు. మెయిన్ పురిలో గతంలో కూడా 9, 10వ శతాబ్దానికి చెందిన పురాతన వస్తువులు బయటపడ్డాయి.