డ్రంకన్ డ్రైవ్ అనేది సూసైడ్ బాంబు లాంటిదని.. డ్రంకన్ డ్రైవ్ చేసిన వాహదారుల లైసెన్స్ రద్దు చేయాలని పోలీసులే న్యాయస్థానం ముందు మోర పెట్టుకుంటున్నారు. అలాంటిది ఓ పోలీసు అధికారియే తప్ప తాగిన మైకంలో తన కారుతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు వాహనాలను ఢీకొట్టి..బీభత్సాన్ని సృష్టించాడు. ఈ ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది.
పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఏఎస్ఐ మద్యంమత్తులో మంగళవారం రాత్రి తన కారుతో ద్వారకా ప్రాంతంలో అలజడి సృష్టించాడు. విచక్షణ రహితంగా కారు నడుపుతూ.. రెడ్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టాడు.
దీంతో ఆరు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఏఎస్ఐ సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన వారిని పోలీసులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమైన ఏఎస్ఐ నుంచి రక్తపు నమూనాలను తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేశామని, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామన్నారు.అయితే ఓ పోలీసు అధికారియే తప్ప తాగి ఇలా ప్రమాదానికి కారణమైనందుకు పోలీసులపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.