బస్సులోంచి డ్రైవర్ దూకేయడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన తెలంగాణలోని కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పడంతో బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదం బస్సు డ్రైవర్ వల్లే జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.
బస్సులోంచి డ్రైవర్ ఉన్నట్టుండి అకస్మాత్తుగా దూకేయడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని చెబుతున్నారు. డ్రైవర్ అలా ఒక్కసారిగా దూకడానికి కారణం ఏంటో అనే విషయం ఒక్కసారిగా ప్రయాణికులకు అర్థం కాలేదు. బస్సు డ్రైవర్ కి ఛాతిలో నొప్పి రావడంతో.. గుండెపోటు అనుకుని బస్సును స్లో చేసి.. అందులోంచి దూకేశారు. దీంతో బస్సు కాస్త ముందుకు వెళ్లి అదుపు తప్పి బోల్తా పడింది.
ప్రమాద సమయంలో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. అయితే ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి. మిగతా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ చికిత్స పొందుతున్నారు. బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండి ఉంటే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేదని.. తక్కువ మంది ఉండడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.
డ్రైవర్ బ్రేక్ వేసి.. బస్సులోనే ఉన్నా బస్సు బోల్తా పడే ప్రమాదం ఉండేది కాదని నెటిజన్లు అంటున్నారు. గుండెపోటు వచ్చినట్టు అనిపించినా, గుండెపోటు వచ్చినా సమయస్ఫూర్తిగా మెలగడం ఎలాగో యాజమాన్యం శిక్షణ ఇస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.