కొమురంభీం జిల్లాలో యూరియా కోసం రైతులు 17 రోజులుగా పోరాటం చేస్తున్నారు. యూరియా అందక విలువైన పంటలు నష్టపోవాల్సివస్తోందని, వెంటనే యూరియా సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని రోజూ వచ్చి ప్రాధేయపడుతున్నా అధికార యంత్రాంగం కిమ్మనడం లేదు. దాంతో విసుగెత్తిన రైతాంగం మార్కెట్ యార్డు దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. రైతులు చేస్తున్న ఈ పోరాటానికిి సంఘీభావంగా అక్కడికి వచ్చిన బీజేపీ స్థానిక శాసనసభ్యుడు రావి శ్రీనివాస్ ధర్నాలో పాల్గొన్నారు. పోలీసులు వచ్చి చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో వారిని నిలువరిస్తూ ఎమ్మెల్యే పోలీస్ వాహనానికి అడ్డంగా పడుకుని నిరసన తెలియజేశారు. రైతులకు యూరియా అందక ఇబ్బంది పడుతుంటే శాసనసభలో సీయం కేసీఆర్ కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.
పోలీసులు ఎమ్మెల్యే రావి శ్రీనివాస్‌ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నేతలు కొంగ సత్యనారాయణ, గొలం వెంకటేశ్, ఠాకూర విజయసింగ్ తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.