తెలంగాణలో మరోపార్టీకి అవకాశం లేదని.. మూడోసారి కూడా టీఆర్‌ఎస్సే గెలిచి యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ట్విటర్ వేదికగా మరోసారి ఆస్క్ కేటీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక డీజిల్ 100 దాటితే.. గ్యాస్ వెయ్యి దాటిందని.. ఇవి చరిత్రలో నిలిచిపోతాయని ఎద్దేవా చేశారు. గ్యాస్ ధరలు పెంచడంలో మోడీ రికార్డ్ సాధించారని.. ఈ విషయంలో ఆయన్ను ఎవరు ఆపలేకపోతున్నారని విరుచుకుపడ్డారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిని బీజేపీ అమ్ముకుంటోందని అన్నారు. బీజేపీ అంటే బేచో జనతాకి ప్రాపర్టీ అని.. దాని అసలు స్వరూపం ఇదేనని వ్యాఖ్యానించారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలతో పాటు.. చాలా పార్టీలు మాకు పోటీలో ఉన్నాయని పేర్కొన్నారు కేటీఆర్. రాహుల్ గాంధీ తెలంగాణ ముచ్చట పక్కకు పెట్టి మొదట అమేథీలో గెలవడంపై దృష్టి పెట్టాలని చురకలు అంటించారు. బీజేపీ గ్యాస్ ధరలు పెంచుతూ రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని సరికాదని వివరించారు.
కేంద్రం తెలంగాణకు ఏమీ చేయట్లేదని ఆరోపించారు. మిషన్ భగీరథ కోట్లాది మంది ప్రజల గేమ్ ఛేంజర్ అని అభిప్రాయపడ్డారు. ఏడేళ్లలో 120 శాతం వ్యవసాయం పెరిగిందని తెలిపారు కేటీఆర్. 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమాతో సాధ్యమైందన్నారు. విద్యావిధానం, ఎన్నికల్లో మిస్సింగ్ ఓట్లు, నగరంలో అభివృద్ధి, వివిధ సమస్యల గురించి నెటిజన్లు కేటీఆర్ ని ప్రశ్నలు అడిగారు. అందరికీ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సమాధానాలు ఇచ్చారు.