మాఫియా వేధింపులతో ప్రముఖ వ్యాపారవేత్త, జంతు ప్రేమికుడు వినీత్ బగారియా ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కుటుంబాన్ని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ శనివారం పరామర్శించారు. బగారియా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బగారియాను కాపాడుకోలేక పోయామని ఆయన ఆవేదన చెందారు. ఈ విషయంలో తనను క్షమించాలని బగారియా కుటుంబ సభ్యులను ఆయన కోరారు.
ఈ విషయంలో జిల్లా ఎస్పీని ఆయన తీవ్రంగా మందలించారు. పోలీసులు ప్రజలకు మిత్రుల్లాగా వ్యవహరించాలని ఆయన సూచించారు. దిబ్రూగర్ ప్రాంతంలోనే ప్రభుత్వ అభ్యర్థనను పోలీసులు అర్థం చేసుకోకపోతే మిగతా గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏంటంటూ సీఎం ప్రశ్నించారు.
బగారియాను తమ ప్రభుత్వం కాపాడులేకపోయిందన్నారు. ఈ విషయంలో తాను సిగ్గుపడుతున్నానని చెప్పారు. అమాయకులకు జిల్లా పోలీసులు అండగా నిలవడలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు. భైదుల్లా ఖాన్, నిషాంత్ శర్మ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలక సూత్రదారిగా అనుమానిస్తున్న సంజయ్ శర్మ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
మాఫియా వేధింపులు తాళలేక వినీత్ బగారియా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య సమయంలో ఓ సెల్ఫీ వీడియో తీశాడు. ఆ వీడియోలు తన తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ… ‘ అమ్మా నన్ను క్షమించండి. ఇక వేధింపులు తట్టుకోలేకపోతున్నాను’ అని పేర్కొన్నాడు.