తమ రాష్ట్రానికి వచ్చి.. ఇక్కడి కజిరంగా నేషనల్ పార్క్ ని విజిట్ చేయాలని అసోం సీఎం హిమంతా బిస్వ శర్మ..హాలీవుడ్ నటుడు లియోనార్డో డీ కాప్రియోను కోరారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం పంపుతూ .. ఈ పార్క్ లోని ఒంటికొమ్ము ఖడ్గమృగాల సంరక్షణ పట్ల మీరు చూపిన ఆసక్తి తమనెంతో సంతృప్తి పరచిందన్నారు. . వన్యమృగ ప్రాణుల సంరక్షణకు మేము పలు చర్యలు తీసుకుంటున్నామని, ఒకసారి ఇక్కడికి వచ్చి కజిరంగా నేషనల్ పార్క్ ని విజిట్ చేయాలని శర్మ.. ఈ ఇన్విటేషన్ లో అభ్యర్థించారు.
2021 నుంచి ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో ఒక్క ఖడ్గమృగం కూడా వేటగాళ్ల బారిన పడలేదని, అందుకు అసోం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కారణమని డీకాప్రియో.. ఇటీవల తన ఇన్స్ టా గ్రామ్ లో ప్రశంసించారు.
గతంలో ..రెండేళ్ల కాలంలో ఈ ఖడ్గ మృగాల కొమ్ములకోసం సుమారు 190 ఖడ్గమృగాలను చంపారని ఆ నటుడు పేర్కొన్నారు. కజిరంగా పార్క్ లో 2,200 ఖడ్గమృగాలున్నాయని, ఇది ప్రపంచంలోని వీటి సంఖ్యలో మూడింట రెండువంతులని ఆయన తెలిపారు.
వీటి సంరక్షణకు అసోం సర్కార్ తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయన్నారు. ఈ పోస్ట్ తాలూకు స్క్రీన్ షాట్ ను కూడా హిమంత బిస్వ శర్మ తన ఆహ్వానానికి జోడించారు. మరి ఈ ఆహ్వానాన్ని మన్నించి డికాప్రియో అసోం కు వస్తారేమో చూడాలని ఈ రాష్ట్ర అధికారులు వెయ్యి కళ్ళతో ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు.