- అస్సాం, మేఘాలయాలో భారీ వర్షాలు
- వరద బీభత్సం.. 55 మంది మృతి
ఈశాన్య రాష్ట్రాలలో వర్ష బీభత్సంతో వరదలు ముంచెత్తాయి. అసోం రాష్ట్రంలో ఎడతెగని వర్షాలతో పలు ప్రాంతాలు జలదిగ్భందమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదల కారణంగా ఇద్దరు చిన్నారులు సహా 55 మంది మరణించారు.
మరోవైపు హోజాయ్ జిల్లాలోని ఇస్లామ్‌పూర్‌లో.. వరద బాధితులను తరలిస్తున్న పడవ బోల్తాపడటంతో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న 21 మందిని అధికారులు సురక్షితంగా ఒడ్డుకుచేర్చారు.
మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ లో వరద ప్రభావంతో పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కొండచరియలు విరిగిపడి రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో 18 మంది చనిపోయారు. బ్రహ్మపుత్ర, బరాక్ నదులు, వాటి ఉపనదుల ఉగ్రరూపంతో.. అసోంలోని 2,930 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. 43,338 హెక్టార్ల మేర పంట నష్టం సంభవించింది.
కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, అసోం సీఎం హిమంత బిస్వా శర్మలు వరద పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రంలో బ్రహ్మపుత్ర, కోపిలి, పలాదాడియా, జియా-భరాలి, మానస్, బెకి సహా పలు నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దిమా హసావోలో జలవిద్యుత్ ప్రాజెక్ట్ నాలుగు స్లూయిస్ గేట్లు తెరవడంతో కర్బీ ఆంగ్లోంగ్, మోరిగావ్, నాగావ్ జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు.